సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

విడుదల తేదీ : 29 జనవరి 2016
దర్శకత్వం : శ్రీనివాస్ గవిరెడ్డి
నిర్మాత : ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టిథ
సంగీతం : గోపీ సుందర్
నటీనటులు : రాజ్ తరుణ్, అర్తన బిను….

‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’.. ఇలా వరుస హిట్స్‌తో తెలుగులో అతికొద్ది మందికే సాధ్యమైన హ్యాట్రిక్ ఫీట్‌ను కెరీర్ ప్రారంభంలోనే సొంతం చేసుకున్న హీరో రాజ్ తరుణ్, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అంటూ సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించే ఆలోచనతో మరో లవ్‌స్టోరీతో సిద్ధమైపోయారు. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి రాజ్ తరుణ్ సక్సెస్ జోష్‌ను కొనసాగించే సినిమాగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ నిలిచిందా? చూద్దాం..
కథ :
రామచంద్రాపురం అనే ఊర్లో భవిష్యత్‌ గురించి పెద్దగా పట్టింపుల్లేని, అల్లరి చిల్లరిగా తిరిగే శ్రీ రామ్(రాజ్ తరుణ్), చిన్నప్పట్నుంచీ అదే ఊర్లో ఉండే సీతా మహాలక్ష్మి(అర్తన)ని అమితంగా ప్రేమిస్తూంటాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతో ఇష్టమైన క్రికెట్‌నే కాదనుకున్న రామ్, సీతకు తన ప్రేమను వ్యక్తపరిచే విషయంలో మాత్రం ప్రతిసారీ విఫలమవుతుంటాడు. ఇదిలా ఉండగానే.. సీత, పై చదువుల కోసమని హైద్రాబాద్‌కు వెళ్ళిపోతుంది. కేవలం సెలవుల్లో మాత్రమే ఊరికి వచ్చే సీతకు, తన ప్రేమను వ్యక్తపరచడానికి రామ్ విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు.
ఈ క్రమంలోనే ఓసారి సెలవుల్లో ఊరికి వచ్చినపుడు సీత, రామ్‌కు దగ్గరవుతుంది. మొదట కాదన్న, తర్వాత అతడిని అర్థం చేస్కొని ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే తన కూతురిని చేసుకునే వాడు మంచి పేరున్న వాడవ్వాలని కోరుకునే సీత తండ్రి, ఇంటర్ కూడా పూర్తి చేయని రామ్‌ను అల్లుడిగా ఒప్పుకోకపోగా ఆమెకు వేరెకరితో పెళ్ళికి ఫిక్స్ చేస్తాడు. మరి సీత తండ్రితో పాటు తన ప్రేమకు అడ్డైన ఆమె అన్నయ్య, పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి, పరిస్థితులు.. ఇన్నింటిపై పోరాడి రామ్‌, సీతను ఎలా దక్కించుకున్నాడన్నదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే హీరో రాజ్ తరుణ్ అనే చెప్పుకోవాలి. తనదైన మార్క్ డైలాగ్ డెలివరీతో, ఎక్కడా నెమ్మదించని యాక్టింగ్ స్కిల్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను తన భుజాలపై మోసుకొచ్చాడు. ఇక హీరోయిన్‌గా నటించిన అర్తన చాలా అందంగా ఉండడంతో పాటు బాగా నటించింది. రొటీన్ కథనే వీరిద్దరూ తమ తమ ప్రెజెన్స్‌తో ఉన్నంతలో బాగా నడిపించారు. ఇక మొదట్నుంచీ, చివరివరకూ సినిమాను హీరో నేపథ్యంలో నడుపుతూ అతడి చూట్టూ మంచి కామెడీ రాబట్టగలిగారు. హీరో గ్యాంగ్‌లో భాగమైన షకలక శంకర్, నవీన్ తదితరులు బాగా నవ్వించారు. హీరోయిన్ తండ్రిగా నటించిన రాజా రవీంద్ర మంచి ప్రతిభ చూపారు.
ఇక సినిమా పరంగా చూసుకుంటే ఈ సినిమాకు హైలైట్ అంటే పంచ్ డైలాగులతో చాలా చోట్ల నవ్వించే ప్రయత్న చేయడం గురించి చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ మొత్తం హీరో, హీరోయిన్‌కు ప్రేమను వ్యక్తపరచడమనే అంశంపైనే నడుపుతూ సరదాగా, ఎక్కడా డ్రాప్ అవకుండా బాగానే నడిపించారు. రొటీన్ అయినా కూడా బేసిక్ లవ్ స్టోరీ బాగుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథను మొదలుపెట్టి దానికి చివర్లో క్రికెట్ పందెం అనే అంశాన్ని జోడించి హీరో పాత్రకు ఒక టార్గెట్‌ను రూపొందించి కొన్ని చోట్ల కామెడీ పండించారు. క్రికెట్ ఆట చుట్టూనే సాగే క్లైమాక్స్ పార్ట్‌లో ఫన్ ఫర్వాలేదు. ఇక సినిమాలోని పాటలన్నీ వినడానికి, చూడడానికి బాగున్నాయి. ఈ పాటలు మంచి రిలీఫ్‌నిస్తాయి. సెకండాఫ్‌లోనే వచ్చే రెండు, మూడు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ఎంచుకున్న అసలు కథనే మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్‌లు ప్రేమించుకోవడం, వారి ప్రేమకు కొన్ని పరిస్థితులు, వ్యక్తులు అడ్డురావడం, వీటన్నింటినీ ఎదిరించి హీరో తన ప్రేమను సొంతం చేసుకోవడం అన్న బేసిక్ లైన్ రొటీన్ అయినా కూడా ప్రేమకథల్లో ప్రధానంగా ఉండేది ఇదే కావడంతో ఈ లైన్‌లో ఏ సమస్యా లేదు. అసలు సమస్య ఈ బేసిక్ లైన్‌కు క్రికెట్‌ను కలిపి, క్రికెట్ పందెంలో గెలిచిన వారికి అమ్మాయి సొంతం అవుతుందన్న ఆలోచన ఏమాత్రం బాలేదు. సెకండాఫ్‌లో రామ్‌కు నిర్దేశించిన లక్ష్యమే అనాలోచితమైనప్పుడు, అతడేం చేసినా, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నా అది కనెక్ట్ కాలేదు. దీంతో అసలు కథే సెకండాఫ్‍ను మైనస్‌గా నిలబెట్టింది.
ఇక రామ్, సీతల ప్రేమకథలో పెద్దగా ఎమోషన్ లేదు. హీరోయిన్, హీరో ప్రేమలో పడిపోవడం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. రామ్ పాత్రను పక్కనబెడితే మిగతా అన్ని పాత్రలకూ సరైన పాత్ర చిత్రణ లేదు. పూర్తిగా కామెడీనే నమ్ముకోవడం అనే అంశం వల్ల కొన్నిచోట్ల సన్నివేశాల్లో అతి ఎక్కువ అయింది. అలాగే, తనతో పాటే ఉంటూ, ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండే స్నేహితులను ఊరికే చెంప మీద కొడుతూ పోయే తరహా హీరో పాత్రతో నవ్వించాలన్న ఆలోచనే చీప్‌గా ఉంది. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌ను మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి గురించి చెప్పుకుంటే.. ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పగల ఆస్కారం ఉన్న ప్రేమకథనే ఎంచుకొని బేసిక్ లైన్‌ను బాగానే తయారు చేసిన శ్రీనివాస్, దానికి కలిపిన అసలు కథను మాత్రం చాలా సాదాసీదాగా, ఏమాత్రం ఎమోషన్ లేని విధంగా తయారు చేసుకొని రచయితగా పెద్దగా మెప్పించలేకపోయాడు. ఇక దర్శకుడిగా కొన్ని చోట్ల కామెడీని పండించిన విధానం, నటీనటుల దగ్గర్నుంచి పూర్తి ఔట్‍పుట్‍ను రప్పించడం లాంటి విషయాల్లో మెప్పించినా, పూర్తి స్థాయిలో మాత్రం అలరించలేకపోయాడు. అనీల్ మల్లెలతో కలిసి శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి.
ఇక సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది సంగీత దర్శకుడు గోపీ సుందర్. మళయాలంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన గోపీ సుందర్, తెలుగులో ఇప్పటివరకూ చేసిన సినిమాల్లానే ఈ సినిమాలోనూ పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగానూ గోపీ సుందర్ బాగా ఆకట్టుకుంటాడు. విశ్వ సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగ్గ మూడ్‍ను క్యారీ చేస్తూనే గ్రామీణ వాతావరణాన్ని ప్రేమకథ నేపథ్యానికి చక్కగా సెట్ చేశాడు. ఇక ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ పనితనం ఆకట్టుకునేలా లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
రాజ్ తరుణ్ మొదటి సినిమా అయిన ‘ఉయ్యాల జంపాల’లోని ఇన్నోసెన్స్, రెండో సినిమా అయిన ‘సినిమా చూపిస్త మావా’లోని ఫన్.. ఈ రెండింటినీ మిక్స్ చేసి చెప్పే ప్రయత్నం చేసిన రొటీన్ లవ్‌స్టోరీయే ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. అయితే ఈ సినిమాలో ఈ రెండింటినీ సరిగ్గా వాడుకోవడంలో, ఆ రెండు అంశాలతో ఓ కథ చెప్పడంలో ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేని ప్రయత్నంగా మిగిలింది. రాజ్ తరుణ్ యాక్టింగ్, కొన్నిచోట్ల నవ్వించే సన్నివేశాలు, గోపీ సుందర్ అందించిన మ్యూజిక్, వాటిని తెరకెక్కించిన విధానం.. ఇలా కొన్ని అంశాలను వదిలేస్తే ఈ సినిమాలో ప్రేమకథకు ఉండాల్సిన అసలైన ఎమోషనే లేదు. ఇక పైన చెప్పిన అంశాల కోసం మాత్రమే చూడాలనుకుంటే ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అంతకుమించి ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రామయ్య చేసే సిత్రం అంతంత మాత్రమే

కళావతి

విడుదల తేదీ : 29 జనవరి 2016
దర్శకత్వం : సుందర్.సి
నిర్మాత : గుడ్ ఫ్రెండ్స్ సంస్థ
సంగీతం : హిప్ హాప్ తమిజ
నటీనటులు : సిద్దార్థ్, త్రిష, హన్సిక, పూనం బజ్వా..

2014లో తమిళంలో హిట్ అయిన ‘అరన్మనై’కి డబ్బింగ్ వెర్షన్ గా తెలుగులోకి వచ్చి హిట్ అయిన సినిమా ‘చంద్రకళ’. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా చేసిన ‘అరన్మనై 2’ ని తెరకెక్కించారు. ఈ సినిమాని తెలుగులో ‘కళావతి’గా డబ్ చేసారు. సుందర్ సి డైరెక్షన్ లో సిద్దార్థ్, త్రిష, హన్సిక ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ హర్రర్ కామెడీ సినిమా ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. మరి చంద్రకళ కి సీక్వెల్ గా వచ్చిన ఈ కళావతి ఎంత వరకూ నవ్వించి, భయపెట్టిందనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
కోవిలూర్ గ్రామంలోని అమ్మవారి విగ్రహం చాలా మహిమ కలది. అందుకే ఆ ఊరిలో దెయ్యం, భూతం అనే భయం ఉండదు. కానీ ఆ అమ్మవారికి కుంభాభిషేకం చేయాలని నిర్ణయించి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి పక్కన పెడతారు. దాంతో ఆ ఊర్లోని ప్రేత శక్తికి పవర్ వస్తుంది. అక్కడి నుంచి కట్ చేస్తే ఆ ఊరి జమిందార్(రాధా రవి) ఇంట్లో భయానక సంఘటనలు మొదలవుతాయి. ఓ ఆత్మ ఆ ఇంట్లోకి ప్రవేశించి జమిందార్ ని కోమాలోకి వెళ్ళేలా చేస్తుంది. దాంతో ఆయన కుమారుడు మురళి(సిద్దార్థ్), తను పెళ్లి చేసుకోబోయే అనిత(త్రిష) కూడా వెంటనే ఇంటికి వస్తారు. వీరికి కూడా అంతు చిక్కని కొన్ని భయానక సంఘటనలు జరుగుతునతాయి.
అసలు ఏంజరుగుతున్నాయో అర్థం కాని టైంలో అనిత అన్నయ్య అయిన రవి(సుందర్.సి) వస్తాడు. అలా వచ్చిన రవి అక్కడ జరుగుతున్నవిషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అసలు రవి తెలుసుకున్న విషయాలేమిటి? ఆ ఆత్మ ఎవరిదీ? అసలు ఆ జమిందార్ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసింది? చివరికి వారిని చంపేసిందా లేక రవి వారిని ఆత్మ నుంచి కాపాడాడా అన్నది తెలుసుకోవాల్సిన కథ..
ప్లస్ పాయింట్స్ :
హిట్ అయిన ‘చంద్రకళ’ సినిమాకి సీక్వెల్ అని చెప్పుకొని రిలీజ్ చేయడం, అలాగే ఇందులో స్టార్స్ ఎక్కువ మంది ఉండడమే ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్. ఇక ఈ సినిమాలోకి వస్తే.. సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరంగా, కాస్త ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉండడంతో చూసే అందరిలోనూ ఉత్కంటని క్రియేట్ చేయడమే. ఆ తర్వాత జమిదార్ ప్యాలెస్ లో వచ్చే కొన్ని హర్రర్ సన్నివేశాలు ఆడియన్స్ ని భయపెడతాయి. చిన్న పిల్లాడు, త్రిష మీద వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అలాగే ఇంటర్వల్ బ్లాక్ బాగుంది. ఇక సెకండాఫ్ కి వస్తే ఆ ఆత్మ గురించి తెలియగానే దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో పాటు క్లైమాక్స్ అంశాలు సినిమాకి పెద్ద హైలైట్ గా నిలిచాయి.
ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. త్రిష, హన్సికల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. త్రిష సిద్దార్థ్ లవర్ గా, ఆత్మ వచ్చే అమ్మాయిలా చాలా మంచి నటనని కనబరిచింది. ముఖ్యంగా మొదటి బీచ్ సాంగ్ లో తన కెరీర్లో మునుపెన్నడూ లేనంతగా బికినీలో అందాలను ఆరబోసింది. ఈ సాంగ్ మాత్రం విజువల్ ట్రీట్. ఇక మెయిన్ లీడ్ రోల్ లో హన్సిక నటన బాగుంది. మెయిన్ గా సీరియస్, భయపెట్టే, ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేసింది. వీరిద్దరూ సెకండాఫ్ ని సేవ్ చేసారని చెప్పాలి. ఇక సుందర్ సి తనదైన నటనతో ఆకట్టుకుంటే, సిద్దార్థ్ తన పాత్రకి న్యాయం చేసాడు. గ్లామర్ అట్రాక్షన్ అయిన పూనం బజ్వా ఓకే ఓకే అనిపించుకుంది. ఇక కమెడియన్స్ అయిన సూరి, కోవై సరళ, మనోబాలలు అక్కడక్కడా నవ్వించారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వీరి మధ్య వచ్చే బస్ మరియు హోటల్ ఎపిసోడ్ అందరినీ బాగా నవ్విస్తుంది. ఇక మిగతా నటులలో రాధారవి, రాజ్ కపూర్, అతిధి పాత్రలో వైభవ్ బాగా చేసారు. త్రిష – సూరి కాంబినేషన్ లో వచ్చే ఓ సీన్ బాగా నవ్విస్తుంది.
ఇక సినిమా పరంగా చూసుకుంటే ఈ సినిమాకి సెకండాఫ్ మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఇంటర్వల్ బ్లాక్ తర్వాత అసలు కథలోకి ఎంటర్ కావడం, అక్కడి నుంచి చకచకా సినిమాని ముందుకు తీసుకెళ్లడం, అలాగే కామెడీ, హర్రర్ రెండిటినీ బాలన్స్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లడం వలన ఆడియన్స్ సినిమాలో లీనమవుతారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ సన్నివేశాలు, సెకండాఫ్ లోని చివరి 40 నిమిషాలు సినిమాని నిలబెట్టాయి.
మైనస్ పాయింట్స్ :
కళావతి హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన సినిమా.. కావున టేకింగ్ ఇప్పటి వరకూ వచ్చిన అన్ని హర్రర్ కామెడీ సినిమాల ఫార్మాట్ లోనే ఉంటుంది. సినిమా మొదటి 10 నిమిషాల తర్వాత సినిమా ఎలా ముగుస్తుంది అనేది మీరు ఊహించేయవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్ లో హర్రర్ తోపాటు రాసుకున్న కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించలేకపోయాయి. అందువలన సినిమా ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా, మీరేమైతే అనుకుంటారో అదే పొల్లు పోకుండా జరుగుతూ ఉండడం వలన మీరు బోర్ ఫీలవుతారు. ముఖ్యంగా చంద్రముఖి, చంద్రకళ ఫేవర్ లోనే ఈ సినిమా ఉంటుంది.
ఇక సినిమాకి చాలా పెద్ద ప్లస్ కావాల్సిన పాయింట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. కానీ అది చాలా సింపుల్ గా ఉండడంతో పెద్ద కిక్ ఇవ్వదు. ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండి ఉంటే బాగుండేది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గౌరవం సినిమాలో లానే ఉంటుంది. దీని వలన సినిమా మొత్తం ఊహాజనితంగా ఉండడం వలన ట్విస్ట్ లు అనేవి మీరు ముందే ఊహించేయగలరు. అలాగే సినిమాలో పాటలు పెద్ద మైనస్. దాదాపు అన్ని పాటలు సినిమాని సాగాదీయడానికే వచ్చినట్లు ఉంటాయి.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి కీలకమైన కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన కెప్టెన్ సుందర్.సి. ఆయన కథలో కొత్తదనం లేదు. తన చంద్రకళ సినిమాలానే ఉంటుంది. కథ పెద్దగా లేదని తెలియడం వలన కథనంలో కూసింత మేనేజ్ చేయడానికి ట్రై చేసాడు కానీ అక్కడా పూర్తిగా సక్సెస్ కాలేదు. అంత ఆసక్తికర స్క్రీన్ ప్లే లేనందువల్ల సినిమా చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. కథ – కథనంలో మిస్ అయిన చాలా వాటిని దర్శకుడిగా సెకండాఫ్ లో బాలన్స్ చేసుకుంటూ సినిమాని నడిపించడమే పెద్ద హైలైట్. కావున డైరెక్టర్ గా సుందర్ సి సక్సెస్ అయ్యాడు. కానీ విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా ఇంకాస్త బెటర్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది.
యుకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. నైట్ అండ్ డే ఎఫెక్ట్స్ ని బాగానే చూపించాడు. హిప్ హాప్ తమిజ అందించిన పాటలు తెలుగులో పెద్ద సెట్ కాలేదు. కానీ నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటర్ శ్రీకాంత్ ఇంకాస్త కేర్ తీసుకొని మొదటి అర్థభాగంలో కొన్ని సీన్స్ ని కత్తిరించి ఉండాలి. ఇక గుడ్ ఫ్రెండ్స్ డబ్బింగ్ విలువలు బాగున్నాయి.
తీర్పు :
‘చంద్రకళ’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ ‘కళావతి’ కూడా అదే ఫార్మాట్ లో రూపొంది, ప్రేక్షకులను థియేటర్స్ లో నవ్వించి, భయపెట్టి.. బాగుందే సినిమా అనుకునే ఫీల్ తో బయటకి పంపుతుంది. హర్రర్ కామెడీ జానర్లో ఇప్పుడొస్తున్న చాలా సినిమాల కోవలేనే ఇదీ ఉన్నప్పటికీ సినిమాలో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే అంశాలు ఉండడం వలన సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా కథ రెగ్యులర్ అవ్వడం వలెనే డైరెక్టర్ సుందర్ సి తెలివిగా స్టార్ కాస్టింగ్ మరియు హిట్ సినిమాకి సీక్వెల్ అని చెప్పి చాలా సేఫ్ గేమ్ ఆడి సక్సెస్ అయ్యాడు. కళావతి సినిమాలోని హర్రర్ ఎలిమెంట్స్ మరియు సెకండాఫ్ లోని చివరి ౪౦ నిమిషాలు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే.. అదే రొటీన్ హర్రర్ కామెడీ కథ, కథనాలకి వీక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోడవ్వడం సినిమాకి మైనస్. ఓవరాల్ గా ఈ వారం టైం పాస్ కోసం ఓ సారి చూసి ఎంజాయ్ చేయదగిన హర్రర్ కామెడీనే ‘కళావతి’.

నేనూ రౌడీనే

విడుదల తేదీ : 29 జనవరి 2016
దర్శకత్వం : విజ్ఞేష్ శివన్
నిర్మాత : సాయి ప్రసాద్ కామినేని
సంగీతం : అనిరుధ్
నటీనటులు : విజయ్ సేథుపతి, నయనతార.
కథ :
మీనా కుమార్ (రాధికా) అనే పోలీస్ ఆఫీసర్‌కు కుమారుడైన పండు (విజయ్ సేథుపతి) తన చిన్నతనంలో విన్న ఓ కథ ఆధారంగా, పెద్దయ్యాక, అయితే రౌడీనే అవ్వాలని ఫిక్స్ అవుతాడు. ఇదే ఆలోచనతో పెరిగి పెద్దైన పండు, ఓ చిన్నపాటి రౌడీగా ఎదిగి ఎవ్వరికీ తెలియకుండా సెటిల్‌మెంట్స్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడికి కాదంబరి (నయనతార) అనే పూర్తి స్థాయి వినికిడి సమస్యతో బాధపడే ఓ యువతి పరిచయం అవుతుంది. తన కూతురు వినికిడి పోవడానికి, తన భార్య చనిపోవడానికీ కారణమైన కిల్లీ బాబ్జీ (పార్తిబన్) అనే పెద్ద రౌడీపై పగ తీర్చుకునేందుకు కాదంబరి తండ్రి కిల్లీ ఉండే ప్రదేశానికి వెళ్ళి కనపడకుండా పోతాడు.
తండ్రిని వెతికే ప్రయత్నంలోనే కాదంబరికి పండు పరిచయమవుతాడు. కిల్లీని చంపడానికి వెళ్ళిన కాదంబరి తండ్రి ఏమయ్యాడు? తనకు చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా కనిపించిన ఓ రౌడీ, కాదంబరి జీవితంలో విలన్ అని తెలియడంతో పండు ఎలా ఫీలయ్యాడు? కాదంబరి, పండుల మధ్యన ఫ్రెండ్‌షిప్, ప్రేమ? పండు, కాదంబరి పగ కోసం ఏం చేశాడు? ఈ రివెంజ్ కథ ఎలా ముగిసింది? అన్న ప్రశ్నలకు సమాధానమే ’నేను రౌడీనే’!
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక సాధారణ రివెంజ్ కథను, ఎప్పుడూ చూడనంత కొత్తగా, ఆద్యంతం నవ్విస్తూ చెప్పిన విధానం గురించి చెప్పుకోవచ్చు. పండు ఒక కథ విని రౌడీ అవ్వాలనుకోవడంతో మొదలయ్యే కొత్తదనం చివరివరకూ చాలాచోట్ల కనిపిస్తూ ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. పండు, కాదంబరిల పరిచయం, వారిద్దరి మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత కాదంబరి పగ కోసం పండు వేసే ప్లాన్స్ అన్నీ చాలా కొత్తగా ఉండడంతో పాటు బాగా నవ్విస్తాయి. ఈ తరహా కామెడీ తెలుగులో చాలా అరుదుగా మాత్రమే వచ్చిందని చెప్పొచ్చు.
ఇక హీరో విజయ్ సేథుపతి సినిమాకు ఓ ప్రధాన బలంగా నిలిచాడు. కామెడీ సన్నివేశాల్లో టైమింగ్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా ఆకట్టుకున్నాడు. ఇక నయనతార ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకరుగా చెప్పుకోవచ్చు. పూర్తి వినికిడి సమస్యతో ఉన్న యువతిగా నయనతార యాక్టింగ్ కట్టిపడేస్తుంది. తమిళంలో పాపులర్ నటుడు, దర్శకుడు అయిన పార్తిబన్ విలన్‌ అనే పేరుకి కొత్తదనం వచ్చేలా బాగా నటించాడు. విలన్ పాత్ర చిత్రణ కూడా చాలా కొత్తగా ఉంది.
సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్‌ మొత్తం రకరకాల ఉపకథలు, పాత్ర కోణాలను ప్రవేశపెడుతూ ఆద్యంతం నవ్విస్తూ, కొంత ఎమోషనల్ జోన్‌లోకి మళ్ళిస్తూ పకడ్బందీగా ఉంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్ బాగున్నాయి. ఇక సెకండాఫ్‌లో సింగిల్‌పాయింట్‌తో నడిచే కథలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లను హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాను ఒక రివెంజ్ డ్రామానే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి ప్రధాన కథను, దాన్ని చెప్పిన విధానాన్ని తప్పుపట్టడానికి లేదు. అయితే ఫస్టాఫ్‌లోనే పూర్తి కథను చెప్పేయడంతో సెకండాఫ్‌లో సినిమా మొత్తం ఒకే ఒక్క పాయింట్ చుట్టూ తిరిగుతుంది. దీంతో క్లైమాక్స్ ఏంటో ముందే తెలిసిపోతుంది. ఇక ఈ గ్యాప్‌లో వచ్చే సన్నివేశాలన్నీ ఎలా ఉన్నా కూడా పూర్తి కథ తెలిసిపోవడంతో పెద్దగా కిక్ ఉండదు. సెకండాఫ్‌లో మొదటి పది నిమిషాల తర్వాత సినిమా వేగం చాలాసేపు మందగించినట్లు కనిపిస్తుంది.
అదేవిధంగా బ్లాక్ కామెడీ తరహా సినిమా కావడంతో ఈ సినిమాను కావాలనే పూర్తిగా మేకింగ్ దగ్గర్నుంచి మొదలుపెడితే, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్నింటినీ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకున్నారు. ఫార్మాట్‌కు బాగా అలవాటైన ప్రేక్షకులకు ఈ స్టైల్ మేకింగ్ బోర్ కొట్టించవచ్చు. రివెంజ్ తీర్చుకునే క్రమాన్ని సాధారణంగా ఇంటెన్సిటీతో చూపించడమనే కమర్షియాలిటీకి విరుద్ధంగా వెళ్ళిన విధానం సాధారణ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కొత్త తరహా కామెడీ కావడంతో పూర్తిగా కమర్షియల్ పంథాకు అలవాటు పడిన ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఇక కొన్ని చోట్ల కథ ఒక ఎమోషన్ నుంచి మరో ఎమోషన్‌కు మారే క్రమంలో వచ్చే సన్నివేశాలు అసహజంగా ఉన్నాయి. చాలాచోట్ల లాజిక్‌లను పక్కనపెట్టేశారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా మొదటగా దర్శకుడు విజ్ఞేష్ శివన్ ప్రతిభను మెచ్చుకోవాలి. ఒక డిఫరెంట్ టైప్ కామెడీతో రివెంజ్ డ్రామా చెప్పాలన్న ఆలోచనలో దర్శకుడిగా మంచి విజయం సాధించారు. మేకింగ్ పరంగా చాలాచోట్ల విజ్ఞేష్ ప్రతిభ కనబరిచాడు. అయితే రచయితగా మాత్రం సెకండాఫ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ పార్ట్ పరంగా రచయితగా ఇంకొంత వర్క్ చేసి ఉంటే బాగుండేది.
సినిమాటోగ్రాఫర్ జార్జి విలియమ్స్ ఒక డిఫరెంట్ కామెడీకి సరిపడే నేపథ్యాన్ని తెచ్చిపెట్టడంలో మంచి ప్రతిభ కనబరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ మొత్తాన్నీ ఒక చిన్న పాడుపడిన బంగ్లాలోనే కొత్త కోణంలో ఆవిష్కరించడాన్ని మెచ్చుకోవచ్చు. అనిరుధ్ ఎప్పట్లానే తనదైన మార్క్ చూపించుకున్నాడు. పాటలతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కూడా సినిమా నేపథ్యానికి తగ్గట్టే సమకూర్చి సూపర్ అనిపించుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలాచోట్ల అనిరుధ్ చేసిన ప్రయోగం బాగుంది. ఎడిటింగ్ బాగుంది. ఇక తెలుగు డబ్బింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నయనతారకు చిన్మయి ఇచ్చిన డబ్బింగ్ చాలా బాగుంది. తెలుగు డైలాగ్స్ కూడా బాగున్నాయి.
తీర్పు :
తెలుగు, తమిళ సినీ పరిశ్రమకు వచ్చేసరికి యాక్షన్ సినిమా అనగానే ఎటు తిరిగినా ఓ రివెంజ్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ‘నేనూ రౌడీనే’ కూడా ఓ రివెంజ్‌కు కనెక్ట్ చేసిన కథే. అయితే యాక్షన్‌ను మోతాదుగానే చూపించి, పూర్తిగా ఓ కొత్త స్టైల్ కామెడీతో ఈ రివెంజ్ కథను చెప్పడమే ప్రధాన ప్లస్ పాయింట్. ఈ డిఫరెంట్ కామెడీ అనే కాన్సెప్ట్, నయనతార, విజయ్ సేథుపతిల యాక్టింగ్ కోసం ఈ సినిమాను చూసేయొచ్చు. రివెంజ్ డ్రామా అంటే బలమైన ఇంటెన్సిటీ ఉండాలని కోరుకోవడం, కొత్తదనమున్న కామెడీని పూర్తిగా ఎంజాయ్ చేయలేని ఆలోచనా విధానం ఉన్న వారిని ఈ సినిమా మెప్పించే అంశాలు తక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే.. పాత రివెంజ్ కథకే కొత్తదనమున్న కామెడీని జతచేసుకొని వచ్చిన ఈ సినిమా, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు బాగానే ఉందనిపిస్తుంది. మిగతావారికి ఈ సినిమాలో వారి స్థాయిలో ఆకట్టుకునే అంశాల్లేవు!

లచ్చిందేవికి ఓ లెక్కుంది

విడుదల తేదీ : 29 జనవరి 201
దర్శకత్వం : జగదీశ్ తలసిల
నిర్మాత : సాయి ప్రసాద్ కామినేని
సంగీతం : ఎం.ఎం కీరవాణి
నటీనటులు : నవీన్ చంద్ర, లావణ్య త్రిపాటి, అజయ్..
‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పెయిర్ అనిపించుకున్న నవీన్ చంద్ర – లావణ్య తిపాటి జంటగా నటించిన సినిమా ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన జగదీశ్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ సాయి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుసగా రెండు సూపర్ హిట్స్ తో జోరు మీదున్న లావణ్య త్రిపాటి మూడవ హిట్ అందుకుందా లేదా, జగదీశ్ డైరెక్టర్ గా తొలి హిట్ అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
                                                                                                                                                                                      
కథ :        మన హీరోనవీన్(నవీన్ చంద్ర) జనత బ్యాంకులో హెల్ప్ డెస్క్ లో పనిచేస్తుంటాడు, అదే బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తూ ఉంటుంది మన హీరోయిన్ దేవి(లావణ్య త్రిపాటి). మొదట్లో వీరిద్దరికీ ఆసలు పడదు. కానీ నవీన్ కి ఓ సారి డబ్బు అవసరం పడుతుంది. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో అజయ్(మహేష్) అండ్ టీం వచ్చి వారి బ్యాంకు లో ఉన్న అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఫైల్ తెస్తే, దాని ద్వారా వచ్చే అమౌంట్ లో తనకు వాటా ఇస్తామని చెప్తారు. దాంతో నవీన్ లావణ్యతో క్లోజ్ అవుతాడు.
అలా క్లోజ్ అయ్యి బ్యాంకు నుంచి అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఫైల్ ని కొట్టేస్తాడు. అంతా అనుకున్న దాని ప్రకారమే ఆ అకౌంట్స్ ని బేస్ చేసుకొని డబ్బు కొట్టేయాలని చూస్తూ చిక్కుల్లో పడతాడు మహేష్ అండ్ నవీన్. అసలు ఈ అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఏంటి? వాటి ద్వారా మనీ ఎలా వస్తుంది? నవీన్ డబ్బు కోసం చేసిన ఈ పని వల్ల తను ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు? దేవి ఏమన్నా హెల్ప్ చేసిందా? లేదా అన్నదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
లచ్చిందేవికీ ఓ లెక్కుంది సినిమాకి ఎంచుకున్న అనాధ డబ్బు అలియాస్ అన్ క్లైమ్డ్ అకౌంట్స్ నుంచి డబ్బు కొట్టేసే కాన్సెప్ట్ సినిమాకి మెయిన్ హైలైట్. ఈ పాయింట్ చాలా కొత్తగా ఉండడం వలన ఆడియన్స్ మొదట్లో థ్రిల్ ఫీలవుతారు. అందుకే ఈ సినిమా ప్రారంభం బాగా అనిపిస్తుంది. ఇక అజయ్ టీం డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేసే ప్రీ ఇంటర్వల్ బ్లాక్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. ఈ బ్లాక్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచింది.
అలాగే ఫస్ట్ హాఫ్ లో నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటిల కాంబినేషన్ చూడటానికి బాగుంది, ముఖ్యంగా క్రేజీ పాటలో వీరిద్దరి ట్రాక్ బాగుంది. అలాగే సినిమా అమోదట్లో వీరిద్దరి మధ్యా వచ్చే కొన్ని సీన్స్ బాగుంటాయి. ఇక వారికి ఇచ్చిన పాత్రల్లో నవీన్ చంద్ర, లావణ్య లు పరవాలేధనిపించారు. అజయ్ చేసిన పాత్ర డీసెంట్ గా ఉంటుంది. ఓవరాల్ గా సినిమా రన్ టైం 110 నిమిషాలే కావడం సినిమాకి ప్లస్ అనే చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. వరుసగా ఒక్కో దాని గురించి వీలైనన్ని చెబుతా.. మొదటగా స్టొరీ లైన్ బాగుంది, కానీ దానిని డెవలప్ చేసుకున్న విధానం వీలైనంత బాడ్ గా రాసుకున్నారు. ఎందుకంటే స్టొరీ లైన్ కి చాలా పవర్ ఉన్నా కథలో రాసుకున్న ఒక్క పాత్రని కూడా సరిగా రాసుకోలేదు. ఎక్కడా ఏ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు, కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం కథలో పాత్రలను కూడా స్ట్రాంగ్ గా రాసుకోలేదు. కథ అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఇక ఆ కథకి రాసుకున్న కథనం అస్సలు బాలేదు. పెద్ద థ్రిల్లింగ్ అనిపించే ఎపిసోడ్స్ కూడా ఏమీ లేవు. మరీ క్లైమాక్స్ ని అయితే కిచిడీలా చేసి హడావిడిగా క్లైమాక్స్ ని ముగిస్తారు. అయిపోయిందా అనే షాక్ ని కలిగించేలా అసంపూర్తిగా ముగించడం మైనస్.
ఇకపోతే నేరేషన్ అనేది చాలా చాలా స్లోగా ఉంటుంది. అసలే సినిమా స్లోగా సాగుతోంది అంటే.. సినిమా లో పాటలు వచ్చి వచ్చి ఉన్న ఫీల్ ని ఇంకా దెబ్బ తీస్తాయి. పాటలు అనేవి సినిమాకి హెల్ప్ కాలేదు. ఇకపోతే పాత్రలలో స్ట్రాంగ్ గా లేకపోవడం వలన నటీనటుల నుంచి మనకు బెస్ట్ పెర్ఫార్మన్స్ తెరపై కనపడదు. అలాగే జయప్రకాశ్ రెడ్డి పాత్ర నుంచి కామెడీని రాబట్టుకోవాలని తెగ ట్రై చేసారు. కానీ ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అదీకాక సెకండాఫ్ లో జయప్రకాశ్ – లావణ్య సీన్స్ చాలా డ్రాగ్ అవుతాయి. సెకండాఫ్ ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్ష అనే చెప్పాలి. స్టొరీ లైన్ ప్రకారం సినిమాలో సస్పెన్స్, థ్రిల్స్ కి చాలా ఆస్కారం ఉంది కానీ ఒక్క థ్రిల్ కూడా కనిపించలేదు. ఓవరాల్ గా జగదీశ్ రచన – దర్శకత్వంలోనే మిస్టేక్స్ జరిగాయి.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి టెక్నికల్ టీం లో హెల్ప్ అయిన బెస్ట్ పాయింట్స్ రెండు.. అందులో మొదటిది ఈశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ. సినిమాలో లిమిటెడ్ లొకేషన్స్ లోనే తీసినా ఈశ్వర్ మాత్రం తనకిచ్చిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఇక ఎంఎం కీరవాణి ఈ విజువల్స్ కి మంచి నేపధ్య సగీతం ఇచ్చాడు. పాటలు పరవాలేదనిపించినా సినిమాకి మాత్రం అడ్డంగా మారాయి. కోటగిరి వెంకటేశ్వరా రావు వీలైనంత తగ్గించి సినిమాని ఎడిట్ చేసినా ఆయన ఎడిటింగ్ అస్సలు హెల్ప్ అవ్వలేదు.
ఇక కథ – కథనం – దర్శకత్వం విభాగాలను కొత్త డైరెక్టర్ అయిన జగదీశ్ డీల్ చేసాడు. కొత్త డైరెక్టర్ కావడం వలన చాలా విషయాలలో సరైన అవగాహన లేక తప్పు చేసాడు. చెప్పాలంటే ఒక్క సీన్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్న ఫీలింగ్ ని మీకు కలిగించదు. ఈయన కూడా కంటెంట్ ని వదిలేసి రకరకాల సందర్భాలలో కామెడీని పెట్టి సినిమాని లాగేయాలని చూసాడు కానీ ఎక్కడా నవ్వించ లేకపోయాడు. జగదీశ్ ఈ సినిమాకి ఇచ్చిన బెస్ట్ విషయం ఎంచుకున్న స్టొరీ లైన్, మిగతా అన్నింటిలో ఫెయిల్ అయ్యాడు. దాంతో మొదటి సినిమాతో ఫెయిల్యూర్ ని అందుకున్నాడు. సాయి ప్రసాద్ నిర్మాణ విలువలు పరవాలేదనిపిస్తాయి.
తీర్పు :
ఎస్ఎస్ రాజమౌళి అసిస్టెంట్ జగదీశ్ డైరెక్షన్ లో అందాల రాక్షసి పెయిర్ నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటి మరోసారి జంటగా నటించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అనే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో లెక్క తప్పింది. జగదీశ్ థ్రిల్లర్ కామెడీ ఫార్మాట్ లో ఓ సినిమా అనుకొని దానికి ఓ మంచి స్టొరీ లైన్ కూడా అనుకున్నాడు. కానీ దానిని దేలవాల్ చేస్కోవడంలో, ఆసక్తికరంగా చెప్పలేకపోవడంలో ఈ సినిమా లెక్క తప్పింది. ఒరిజినల్ స్టొరీ లైన్, షార్ట్ రన్ టైం, పరవాలేదనిపించే లీడ్ పెయిర్ పెర్ఫార్మన్స్ సినిమాకి పరవాలేదనిపించే పాయింట్స్ అయితే, కథా విస్తరణ, కథనం, నేరేషన్, డైరెక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా లెక్కలన్ని చూపి ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సినిమానే ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’.