విడుదల తేదీ : 29 జనవరి 2016
దర్శకత్వం : విజ్ఞేష్ శివన్
నిర్మాత : సాయి ప్రసాద్ కామినేని
సంగీతం : అనిరుధ్
నటీనటులు : విజయ్ సేథుపతి, నయనతార.
కథ :
మీనా కుమార్ (రాధికా) అనే పోలీస్ ఆఫీసర్‌కు కుమారుడైన పండు (విజయ్ సేథుపతి) తన చిన్నతనంలో విన్న ఓ కథ ఆధారంగా, పెద్దయ్యాక, అయితే రౌడీనే అవ్వాలని ఫిక్స్ అవుతాడు. ఇదే ఆలోచనతో పెరిగి పెద్దైన పండు, ఓ చిన్నపాటి రౌడీగా ఎదిగి ఎవ్వరికీ తెలియకుండా సెటిల్‌మెంట్స్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడికి కాదంబరి (నయనతార) అనే పూర్తి స్థాయి వినికిడి సమస్యతో బాధపడే ఓ యువతి పరిచయం అవుతుంది. తన కూతురు వినికిడి పోవడానికి, తన భార్య చనిపోవడానికీ కారణమైన కిల్లీ బాబ్జీ (పార్తిబన్) అనే పెద్ద రౌడీపై పగ తీర్చుకునేందుకు కాదంబరి తండ్రి కిల్లీ ఉండే ప్రదేశానికి వెళ్ళి కనపడకుండా పోతాడు.
తండ్రిని వెతికే ప్రయత్నంలోనే కాదంబరికి పండు పరిచయమవుతాడు. కిల్లీని చంపడానికి వెళ్ళిన కాదంబరి తండ్రి ఏమయ్యాడు? తనకు చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా కనిపించిన ఓ రౌడీ, కాదంబరి జీవితంలో విలన్ అని తెలియడంతో పండు ఎలా ఫీలయ్యాడు? కాదంబరి, పండుల మధ్యన ఫ్రెండ్‌షిప్, ప్రేమ? పండు, కాదంబరి పగ కోసం ఏం చేశాడు? ఈ రివెంజ్ కథ ఎలా ముగిసింది? అన్న ప్రశ్నలకు సమాధానమే ’నేను రౌడీనే’!
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక సాధారణ రివెంజ్ కథను, ఎప్పుడూ చూడనంత కొత్తగా, ఆద్యంతం నవ్విస్తూ చెప్పిన విధానం గురించి చెప్పుకోవచ్చు. పండు ఒక కథ విని రౌడీ అవ్వాలనుకోవడంతో మొదలయ్యే కొత్తదనం చివరివరకూ చాలాచోట్ల కనిపిస్తూ ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. పండు, కాదంబరిల పరిచయం, వారిద్దరి మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత కాదంబరి పగ కోసం పండు వేసే ప్లాన్స్ అన్నీ చాలా కొత్తగా ఉండడంతో పాటు బాగా నవ్విస్తాయి. ఈ తరహా కామెడీ తెలుగులో చాలా అరుదుగా మాత్రమే వచ్చిందని చెప్పొచ్చు.
ఇక హీరో విజయ్ సేథుపతి సినిమాకు ఓ ప్రధాన బలంగా నిలిచాడు. కామెడీ సన్నివేశాల్లో టైమింగ్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా ఆకట్టుకున్నాడు. ఇక నయనతార ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకరుగా చెప్పుకోవచ్చు. పూర్తి వినికిడి సమస్యతో ఉన్న యువతిగా నయనతార యాక్టింగ్ కట్టిపడేస్తుంది. తమిళంలో పాపులర్ నటుడు, దర్శకుడు అయిన పార్తిబన్ విలన్ అనే పేరుకి కొత్తదనం వచ్చేలా బాగా నటించాడు. విలన్ పాత్ర చిత్రణ కూడా చాలా కొత్తగా ఉంది.
సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం రకరకాల ఉపకథలు, పాత్ర కోణాలను ప్రవేశపెడుతూ ఆద్యంతం నవ్విస్తూ, కొంత ఎమోషనల్ జోన్‌లోకి మళ్ళిస్తూ పకడ్బందీగా ఉంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్ బాగున్నాయి. ఇక సెకండాఫ్‌లో సింగిల్‌పాయింట్‌తో నడిచే కథలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లను హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాను ఒక రివెంజ్ డ్రామానే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి ప్రధాన కథను, దాన్ని చెప్పిన విధానాన్ని తప్పుపట్టడానికి లేదు. అయితే ఫస్టాఫ్‌లోనే పూర్తి కథను చెప్పేయడంతో సెకండాఫ్‌లో సినిమా మొత్తం ఒకే ఒక్క పాయింట్ చుట్టూ తిరిగుతుంది. దీంతో క్లైమాక్స్ ఏంటో ముందే తెలిసిపోతుంది. ఇక ఈ గ్యాప్‌లో వచ్చే సన్నివేశాలన్నీ ఎలా ఉన్నా కూడా పూర్తి కథ తెలిసిపోవడంతో పెద్దగా కిక్ ఉండదు. సెకండాఫ్‌లో మొదటి పది నిమిషాల తర్వాత సినిమా వేగం చాలాసేపు మందగించినట్లు కనిపిస్తుంది.
అదేవిధంగా బ్లాక్ కామెడీ తరహా సినిమా కావడంతో ఈ సినిమాను కావాలనే పూర్తిగా మేకింగ్ దగ్గర్నుంచి మొదలుపెడితే, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్నింటినీ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకున్నారు. ఫార్మాట్‌కు బాగా అలవాటైన ప్రేక్షకులకు ఈ స్టైల్ మేకింగ్ బోర్ కొట్టించవచ్చు. రివెంజ్ తీర్చుకునే క్రమాన్ని సాధారణంగా ఇంటెన్సిటీతో చూపించడమనే కమర్షియాలిటీకి విరుద్ధంగా వెళ్ళిన విధానం సాధారణ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కొత్త తరహా కామెడీ కావడంతో పూర్తిగా కమర్షియల్ పంథాకు అలవాటు పడిన ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఇక కొన్ని చోట్ల కథ ఒక ఎమోషన్ నుంచి మరో ఎమోషన్‌కు మారే క్రమంలో వచ్చే సన్నివేశాలు అసహజంగా ఉన్నాయి. చాలాచోట్ల లాజిక్‌లను పక్కనపెట్టేశారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా మొదటగా దర్శకుడు విజ్ఞేష్ శివన్ ప్రతిభను మెచ్చుకోవాలి. ఒక డిఫరెంట్ టైప్ కామెడీతో రివెంజ్ డ్రామా చెప్పాలన్న ఆలోచనలో దర్శకుడిగా మంచి విజయం సాధించారు. మేకింగ్ పరంగా చాలాచోట్ల విజ్ఞేష్ ప్రతిభ కనబరిచాడు. అయితే రచయితగా మాత్రం సెకండాఫ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ పార్ట్ పరంగా రచయితగా ఇంకొంత వర్క్ చేసి ఉంటే బాగుండేది.
సినిమాటోగ్రాఫర్ జార్జి విలియమ్స్ ఒక డిఫరెంట్ కామెడీకి సరిపడే నేపథ్యాన్ని తెచ్చిపెట్టడంలో మంచి ప్రతిభ కనబరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ మొత్తాన్నీ ఒక చిన్న పాడుపడిన బంగ్లాలోనే కొత్త కోణంలో ఆవిష్కరించడాన్ని మెచ్చుకోవచ్చు. అనిరుధ్ ఎప్పట్లానే తనదైన మార్క్ చూపించుకున్నాడు. పాటలతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కూడా సినిమా నేపథ్యానికి తగ్గట్టే సమకూర్చి సూపర్ అనిపించుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలాచోట్ల అనిరుధ్ చేసిన ప్రయోగం బాగుంది. ఎడిటింగ్ బాగుంది. ఇక తెలుగు డబ్బింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నయనతారకు చిన్మయి ఇచ్చిన డబ్బింగ్ చాలా బాగుంది. తెలుగు డైలాగ్స్ కూడా బాగున్నాయి.
తీర్పు :
తెలుగు, తమిళ సినీ పరిశ్రమకు వచ్చేసరికి యాక్షన్ సినిమా అనగానే ఎటు తిరిగినా ఓ రివెంజ్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ‘నేనూ రౌడీనే’ కూడా ఓ రివెంజ్‌కు కనెక్ట్ చేసిన కథే. అయితే యాక్షన్‌ను మోతాదుగానే చూపించి, పూర్తిగా ఓ కొత్త స్టైల్ కామెడీతో ఈ రివెంజ్ కథను చెప్పడమే ప్రధాన ప్లస్ పాయింట్. ఈ డిఫరెంట్ కామెడీ అనే కాన్సెప్ట్, నయనతార, విజయ్ సేథుపతిల యాక్టింగ్ కోసం ఈ సినిమాను చూసేయొచ్చు. రివెంజ్ డ్రామా అంటే బలమైన ఇంటెన్సిటీ ఉండాలని కోరుకోవడం, కొత్తదనమున్న కామెడీని పూర్తిగా ఎంజాయ్ చేయలేని ఆలోచనా విధానం ఉన్న వారిని ఈ సినిమా మెప్పించే అంశాలు తక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే.. పాత రివెంజ్ కథకే కొత్తదనమున్న కామెడీని జతచేసుకొని వచ్చిన ఈ సినిమా, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు బాగానే ఉందనిపిస్తుంది. మిగతావారికి ఈ సినిమాలో వారి స్థాయిలో ఆకట్టుకునే అంశాల్లేవు!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి